Articles

గృహ రుణం పొందడం లో ఇబ్బందులు , పరిష్కార మార్గం

by admin admin No Comments

#అర్జున్ రెడ్డి మాదాపూర్ లోని ఒక కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నెల జీతం లక్షా 30 వేలు. హైదరాబాద్ వచ్చి చాలా కాలమైపోయింది. ఎంతైనా ఓ సొంతిళ్ళు ఉండి ఉంటే బెటర్ అనిపించింది.

మియాపూర్ దగ్గర్లో ఈమధ్యే నిర్మాణం పూర్తి చేసుకున్న ఒక గేటెడ్ కమ్యూనిటీలో రూ. 45 లక్షలకు రెండు బెడ్ రూమ్ ల ఫ్లాట్ కొనుగోలుకు అడ్వాన్స్ కింద రూ.10 లక్షలు ఇచ్చేసి బిల్డర్ నుంచి అగ్రిమెంట్ చేసుకున్నాడు.

మిగిలిన రూ.35 లక్షల కోసం బ్యాంకులో గృహ రుణం కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. ఇక అంతా అయిపోయినట్టే అనుకున్నాడు. కానీ ..

దరఖాస్తు పెట్టిన బాంక్ నుంచి ఓరోజు ఆ బ్యాంక్ సేల్స్ మేనేజర్ కాల్ చేసాడు.

“సారీ సర్, మీ దరఖాస్తు రిజెక్ట్ అయిపోయింది. వేరే ప్రయత్నాలు చేసుకోండి” అని చెప్పి పెట్టేసాడు.

అర్జున్ రెడ్డికి విషయం వెంటనే అర్థం కాలేదు. వెళ్లి బ్యాంక్ లో క్రెడిట్ మేనేజర్ ని కలిసాడు. దరఖాస్తు తిరస్కరణకు కారణం ఏంటని అడిగాడు. అప్పుడు ఆయన అసలు విషయం చెప్పాడు.

***

అర్జున్ రెడ్డికి రెండు మూడేళ్ళ క్రితం క్రెడిట్ కార్డు ఉండేది. అవసరానికి మించి ఖర్చు చేస్తుండడంతో అప్పు భారీగా పెరిగిపోయింది. కార్డు ద్వారా వాడుకున్న మొత్తం తిరిగి చెల్లించే దగ్గర అసలు సమస్య మొదలయ్యేది.

సరైన సమయంలో తిరిగి చెల్లింపులు చేయకపోవడం, చెల్లింపుల కోసం ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో బ్యాంక్ ట్రాక్ రికార్డ్ దెబ్బతింది.

ఈ సమస్య ముదిరీ ముదిరీ మొండి బకాయి కిందకు చేరిపోయింది. చివరకు బ్యాంకుకు చెల్లించాల్సిన మొత్తంలో కొంత మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఇక చెల్లించే అవసరం లేకుండానే మొండికెత్తి ‘సెటిల్మెంట్’ చేసుకున్నాడు.

**

ఈ కేసులో అర్జున్ రెడ్డికి బ్యాంక్ నుంచి ఇక ఇబ్బందేమీ లేకపోయినప్పటికీ ఈ వ్యవహారమంతా సిబిల్ లోకి వెళ్ళిపోయింది. ఫలితం ..కొత్తగా ఏ రకమైన బ్యాంక్ రుణం తీసుకోవాలన్నా ఈ పాత ట్రాక్ రికార్డు బ్రేకులు వేస్తోంది. 550 వరకూ పడిపోయిన సిబిల్ స్కోర్ తో బ్యాంకర్లకు ఇతనిపై నమ్మకం లేకుండా పోయింది. ఇప్పుడు గృహ రుణ దరఖాస్తు తిరస్కరణకూ అదే కారణమైంది. అదే దరఖాస్తును పట్టుకుని ఈసారి హెచ్ డీ ఎఫ్ సీ, ఐసీఐసీఐ వంటి ప్రైవేటు బ్యాంకుల గడపా తొక్కాడు. అక్కడా పని కాలేదు. ఇక లాభం లేదనుకుని ఊరుకున్నాడు. అతనికి నెలవారీగా వచ్చే జీతాన్ని లెక్కలోకి తీసుకుంటే .. ఇరవై ఏళ్ళ పీరియడ్ కు రూ. కోటి వరకూ గృహ రుణం పొందే వీలున్నప్పటికీ ఇప్పుడు ఎక్కడా రూపాయి కూడా పుట్టడం లేదు. అక్కడ అడ్వాన్సు.కింద బిల్డర్ కు ఇచ్చిన మొత్తంలో రూ. 2 లక్షలు తిరిగి రానేలేదు.

***

అర్జున్ రెడ్డిలాంటి వ్యక్తులు చాలా మందే ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో తీసుకున్న బ్యాంక్ రుణాలను సరైన సమయంలో చెల్లించకపోవడం, చెల్లింపుల కోసం ఇచ్చిన చెక్కులు బ్యాలెన్స్ మొత్తం లేక వెనక్కు తిరిగి రావడం వంటి ఎన్నో కారణాలతో వీరి క్రెడిట్ (సిబిల్) స్కోర్ బలహీనపడుతూ ఉంటుంది. ఇలాంటి వారికి బ్యాంకులు ఏ రకమైన ఋణాలనూ ఇవ్వడానికి ముందుకు రావు.

ఇలాంటి కేసులకు పరిష్కారం అప్పటికప్పుడే అంత ఈజీగా దొరకదు. పడిపోయిన సిబిల్ స్కోర్ ని వెంటనే పట్టాలెక్కించేందుకు మంత్ర దండం ఏమీ ఉండదు. ప్రయత్నాలు మొదలు పెట్టినా అవన్నీ దీర్ఘకాళికమైనవే.

కానీ ..

అర్జున్ రెడ్డిలాంటి కేసులకు ఇప్పుడు పరిష్కారం ఉంది. అది ఎలాగంటే ..

***

దేశంలో గృహ రుణాలను అందించే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు పోటీగా ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు (NBFC) పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నాయి. వీటి సంఖ్య 50 వరకూ ఉండొచ్చు. ఒక్కో సంస్థ దేశం మొత్తంమీద వందల శాఖలు ఏర్పరుకుని వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి.

వీటిలో డీ హెచ్ ఎఫ్ ఎల్, ఇండియా బుల్స్ వంటి ఆర్థిక సంస్థలైతే ఏటా కొన్ని వేలకోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నాయి.

ఇలాంటి ఆర్థిక సంస్థలన్నీ ఆర్బీఐ గైడెలెన్స్ ప్రకారమే, అచ్చం బ్యాంకులవలెనే తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. వీటికి ఆర్బీఐ కూడా అప్పులిస్తుంటుంది.

వీటి ప్రత్యేకత ఏమిటంటే .. గృహ రుణం కోసం ఎస్బీఐ, పీ ఎన్ బీ వంటి ఎన్నో ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్ డీ ఎఫ్ సీ, ఐసీఐసీఐ వంటి మరికొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో తిరస్కరణకు గురైన ధరఖాస్తులకు కూడా ఇక్కడ రుణం దొరికే అవకాశం 90 శాతం వరకు ఉంటుంది. ఇది ఎంతో ఊరట.

బ్యాంకింగ్ లో కనీసం సిబిల్ స్కోర్ 750 వరకైనా ఉంటేగానీ దరఖాస్తులు తీసుకోరు. కానీ ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీల్లో కొన్ని సిబిల్ 550 వరకున్నా నో ప్రాబ్లమ్ .. మీకు రుణం ఇచ్చే పూచీ మాది అంటున్నాయి.

పట్టా భూములపై కూడా వీటిలో కొన్ని గృహ రుణాలు అందిస్తున్నాయి. వీటిలో HFFC ముఖ్యమైంది.

సరైన బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్లు లేకపోయినా మేమున్నాం రండి అంటోంది indostar అనే ఇంకో సంస్థ. ఈ సంస్థ రూ. 30 లక్షల వరకూ రుణాలు ఇస్తోంది.

ఈ ఎం ఐ తిరిగి చెల్లించే ఆదాయం ఉంటే చాలు. రికార్డెడ్ గా చూపించకపోయినా ఇబ్బందేమీలేదు.. మా దగ్గరే తీసుకోండి రుణం అంటోంది Chola అనే ఇంకో సంస్థ. ఈ సంస్థ రూ. 50 లక్షల వరకూ రుణాలు అందిస్తుంది.

Sriram, Magna, Aadhar, Tata capital, capital first, Fullerton వంటి సంస్థలు సైతం ఇలాంటి కస్టమర్లకు రుణాలను అందిస్తున్నాయి. వడ్డీ రేట్లు కూడా మరీ ఎక్కువగా ఏమీ ఉండవు. అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రూ. 2.67 లక్షల PMAY సబ్సిడీ సైతం పొందే అవకాశం ఉంది.

– శ్రీనివాస్ ముద్దం